తెలంగాణ విమోచన దినం:సెప్టెంబరు 17,1948

--- పోచంపల్లి తిరుపతిరెడ్డి
==============================================================================================
15 ఆఘస్టు 1947 నాడు భారత దేశ ప్రజలు పండగ చేసుకుంటుండగా హైదరాబాద్ సంస్థానంలో భయానకర పరిస్థితులు నెలకొన్నవి.నిజాం నిరాంకుశ పాలనలో రజాకార్ల ఆక్రుత్యాలు పెరిగిపోయి ప్రజల ధన,మాన,ప్రాణ నష్టం జరిగినది.రజాకార్లు, నిజాం పోలీసులు, సైనికులు కలిసి దాదాపు 2000 మందిని చంపేశారు. భైరాన్‌ పల్లిలో 90 మందిని,పరకాల లో 22 మందిని, గుండ్రాంపల్లి 15 మందిని కాల్చి చంపారు.తెలంగాణ సాయుధపోరాటం ఉద్రుతంగా నడుస్తున్నది.రావి నారాయణరెడ్డి, ఆరుట్ల రాంచంద్రారెడ్డి, బి.యెన్.రెడ్డి, బద్దం ఎల్లారెడ్డి తదితర నేతల అద్వర్యంలో ప్రజలు తిరగబడడము మొదలయ్యింది.పీఠం కదులుతుందేమోనని నిజాం కు భయం పట్టుకుని 1947 నవంబర్‌ 29న భారత ప్రభుత్వంతో స్టాండ్ స్టిల్(యధావిధంగా) ఒప్పందాన్ని కుదుర్చుకున్నాడు. వాటిలో ఆఘస్టు 15 కు ముందు బ్రిటిష్ ఇండియాతో హైదరాబాద్ కు ఉన్న వాణిజ్య, రక్షణ,సైనిక ఒప్పందాలు యధావిదంగా కొనసాగించడం తో పాటు హైదరాబాద్, డిల్లి లో ప్రతినిదులను నియమించుకోవడం లాంటివి ముఖ్యమైనవి.భారత ప్రభుత్వంతో కలిసి పనిచేయడం, వారితొ ఒప్పందం చేసుకోవడం రజాకార్ల నాయకుడైన ఖాసిం రజ్వి కి రుచించలేదు.అందువలన అప్పటి ప్రధానమంత్రి చఠారీ ఇంటిని రజాకార్లు ముట్టడించడంతో చఠారీ రాజీనామా చేసిన పిదప నవంబర్‌ 29 నాడు నిజాం ప్రభుత్వం లాయిక్ అలీ ఖాన్ ను ప్రధాన మంత్రి గా నియమించినది.లాయిక్ అలీ ఖాన్ రజాకార్లకు నమ్మదగిన మనిషి కావడం వలన లాయిక్ అలీ ఖాన్ నే ప్రధాని గా నియమించమని నిజాం పైన రజాకార్లు ఒత్తిడి తెచ్చారు.లాయిక్ అలీ ఖాన్ ఇంజినీరింగ్ లో పట్టభద్రుడు, పేరు ప్రఖ్యాతలున్న పారిశ్రామికవేత్త.హైదరాబాద్ సంస్థాన ప్రజలకు 1948 ఆఘస్టు,సెప్టెంబర్ నెలలు చాల ముఖ్యమైనవి.రజాకార్లు చేస్తున్న దురాగతాలను భారత ప్రభుత్వం ఎప్పటికప్పుడు తెలుసుకుని నిజాం ప్రభుత్వానికి తీవ్ర హెచ్చరికలు జారీ చేసింది.నిజాం ప్రభుత్వ వాదన వాస్తవాలకు విరుద్దంగా ఉన్నదని ప్రకటించి అవసరమైతె ప్రత్యక్ష చర్యలకు పూనుకుంటామని భారత ప్రభుత్వం తెలిపినది.
1948 ఆఘస్టు 17 న లాయిక్ అలీ ఖాన్ భారత ప్రభుత్వానికి లేఖ రాశాడు.ఆ లేఖలో లాయిక్ అలీ ఖాన్ యేమన్నాడంటే స్టాండ్ స్టిల్ ఒప్పందాన్ని భారత్ ఉల్లంగించి, ఆర్ధిక ఆంక్షలు అమలుచేస్తు, సరిహద్దు దాడులు జరుపుకుంటు హైదరాబాద్ మీద సైనిక చర్య జరుపుతామని బెదిరిస్తున్నదని, అందువలన ఐక్య రాజ్య సమితికి పిర్యాదు చేస్తామని పేర్కొన్నాడు.అయితె ఆఘస్టు 22 నాడు భారత ప్రభుత్వ కార్యదర్శి లాయిక్ అలీ ఖాన్ కు రాసిన లేఖలో అమాయక ప్రజలపైన రజాకార్లు చేస్తున్న దురాగతాలను పేర్కొంటు నిజాం ప్రభుత్వమే స్టాండ్ స్టిల్ ఒప్పందాన్ని ఉల్లంగించింది అని గట్టిగా సమాదానం ఇచ్చాడు. అంతేకాకుండా హైదరాబాద్ సంస్తానానికి ఐక్యరాజ్య సమితికి పిర్యాదు చేసే హక్కు లేదని పెర్కొంటు మా నిర్ణయంలో ఎలాంటి మార్పు లేదని భారత ప్రభుత్వ కార్యదర్శి లాయిక్ అలీ ఖాన్ కు తెలియచేశాడు.ఆఘస్టు 28 నాడు నిజాం రాజాజి కి రాసిన లేఖలో భారత్ తో స్నేహాన్ని కోరుకుంటున్నామని, సెప్టెంబర్ నెలలో బొంబాయి ద్వారా ఐక్యరాజ్య సమితికి వెళ్ళే హైదరాబాద్ ప్రతినిదుల ప్రయాణాన్ని అడ్డుకోవద్దని పేర్కొన్నాడు.హైదరాబాద్ సంస్తానంలో జరుగుతున్న అల్లర్లు తగ్గాలంటె భారత సైన్యం అక్కడికి రావాల్సిందేనని రాజాజి నిజాం కు ఘాటు గా సమాదానం ఇస్తు లేఖ రాశాడు. ప్రధానమంత్రి నెహ్రు పార్లమెంటులో ప్రసంగిస్తు రజాకార్ల ఆగడాలు పెరిగిపోయినవని అని పేర్కొన్నాడు.
హైదరాబాద్ మీద అధికారాన్ని వదులుకోడానికి మేము ఎట్టి పరిస్తితుల్లోను ఒప్పుకోము,ఐక్యరాజ్య సమితి లో తేల్చుకోడానికి సిద్దమైనట్లుగా లాయిక్ అలీ ఖాన్ పేర్కొన్నాడు. ఐక్యరాజ్య సమితి కి పిర్యాదు చేయడానికై ఐదుగురు సభ్యులతొ కూడిన ఒక బ్రుందాన్ని పంపించాడు.ఐక్యరాజ్య సమితి కి వెళ్ళిన హైదరాబాద్ ప్రతినిదులలో మోయిన్ నవాజ్ జంగ్, శ్రీపతి రావు, అబ్దుల్ల్ రహీం, శ్యాం సుందర్ మరియు జహీర్ అహ్మద్ ఉన్నారు.హైదరాబాద్ మీద హక్కు మాకే ఉందని, ఎట్టి పరిస్తితులల్లో భారత్ లో కలవమని హైదరాబాద్ ప్రతినిదులు ఐక్యరాజ్య సమితికి తెలిపినారు.ఒక వేళ భారత్ దాడికి దిగితే తమ దగ్గర లక్ష మంది సైన్యం సిద్ధంగా ఉన్నది, అంతేకాకుండ సౌదీ అరేబియా కూడా హైదరాబాద్ కు మద్దతుగా యుద్దంలో పాల్గొంటదని లాయిక్ అలీ ఖాన్ బీరాలు పలికాడు.
ఒక వైపు ఐక్యరాజ్య సమితిలో వాదోప వాదనలు జరుగుతుండగానె సర్దార్ వల్లభాయిపటేల్ చొరవతో సెప్టెంబర్ 13న భారత సైన్యం హైదరాబాద్ సంస్తానంలొ లో ప్రవేశించింది.వరంగల్లు విమాన శ్రయం మీద దాడులు జరిపినది.పక్కా ప్రణాళికతో భారత సైన్యం మూడు వైపుల నుంచి ముట్టడించి నిజాం సేనలను మట్టి కరిపించింది.సెప్టెంబర్ 15 నాటికి అనేక ముఖ్య పట్టణాలను భారత్ తమ ఆదీనంలోకి తెచ్చుకుని అన్ని జిల్లాలకు కలెక్టర్లను, యెస్.పి లను నియమించినది. సెప్టెంబరు 17 నాడు నిజాం సైన్యాదిపతి ఎడ్రూస్ తన సేనలతో సహా భారత లెఫ్టినెంటు జనరల్ చౌదరి కి లొంగి పోయాడు.సంస్థానంలోని అన్ని ప్రాంతాలు భారత్ వశం అవుతుండడంతొ నిజాం ప్రతిఘటనను ఆపవలసిందిగా తన సేనలకు పిలుపు నిచ్చి సెప్టెంబరు 17 నాడు బొల్లారం వద్ద సర్దార్ పటేల్ ఎదుట తలవంచి లొంగిపోయాడు.ఐక్యరాజ్య సమితి కి చేసిన పిర్యాదు కూడ ఉపసంహరించుకున్నట్లు నిజాం భారత ప్రభుత్వానికి తెలియ చేశాడు.అధికారం కోల్పోయిన తరువాత నిజాం మాట్లాడుతు గౌరవంగా పరిష్కరించుకోకుండా లాయిక్ అలీ ఖాన్ అడ్డుపడినట్లు పేర్కొన్నాడు.
సెప్టెంబరు 18 నాడు మేజర్ జనరల్ చౌదరి అద్వర్యాన భారత ప్రభుత్వం సైనిక పాలన విదించిది. సెప్టెంబరు 18 న లాయిక్ అలీ ఖాన్ మరియు మంత్రివర్గ సభ్యులందరిని గ్రుహ నిర్బందం లో ఉంచారు.సెప్టెంబరు 20 నాడు రజ్వి ని అర్రెస్టు చేశారు.రజాకార్ల నుంచి దాదాపు పదివేల ఆయుధాలు స్వాదీనపర్చుకున్నట్లు ప్రభుత్వం తెలిపినది.హైదరాబాద్ ఆపరేషన్ పొలో లొ మొత్తం పది మంది సైనికులు మరణించినట్లు భారత ప్రభుత్వం తెలిపినది.భారత సైన్యం చేతిలో హైదరాబాదు సైన్యానికి చెందిన 800 మంది సైనికులు, 1300 మంది రజాకార్లు చనిపోయారు. దాదాపు 2000 మంది రజాకార్లు,1700 మంది నిజాం సైనికులు బందీలు గా పట్టుబడ్డారు.
లాయిక్ అలీ ఖాన్ హైదరాబాద్ సంస్థానానికి కు ఆఖరి ప్రధానమంత్రి,నవంబర్ 1947 నుంచి తెలంగాణకు విమోచన లభించిన నాటి వరకు పదవిలో ఉన్నాడు.గ్రుహ నిర్బందం నుంచి విడుదలైన తరువాత కొంత కాలానికి 1950 మార్చ్ నెలలో లాయిక్ అలీ ఖాన్ పాకిస్తాన్ కు పారిపోయాడు.పాకిస్తాన్ ప్రభుత్వంలో ఉన్నతమైన పదవిని దక్కించుకున్నాడు.హైదరాబాద్ విమోచనాన్ని జీర్ణించుకోలేని లాయిక్ అలీ ఖాన్ అబద్దాలను అన్నిటిని కలగలిపి "ది ట్రాజెడీ ఆఫ్ హైదరాబాద్" అను పుస్తకాన్ని 1962 లో రాశాడు.అయితె ఆ పుస్తకం భారత దేశంలో నిశేదించబడినది.పాకిస్తాన్ ప్రభుత్వం తరుపున ఒక కార్యక్రమానికి న్యూయార్క్ కు వెళ్ళిన లాయిక్ అలీ ఖాన్ న్యూయార్క్ లోనె 24 అక్టోబర్ 1971 నాడు మరణించాడు.
రజాకార్ల నాయకుడు ఖాసిం రజ్వి 1948 నుంచి 1957 వరకు భారత దేశంలో జైలు జీవితం గడిపి, విడుదలయ్యాక వెంటనే పాకిస్తాను వెళ్ళిపోయాడు.పాకిస్తాన్ వెళ్ళే ముందు ఖాసిం రజ్వి మజ్లిస్-ఇత్తెహదుల్-ముస్లిమీన్ పార్టి అద్యక్ష బాద్యతలు అబ్దుల్ వహిద్ ఒవైసికి అప్పగించాడు.అబ్దుల్ వహిద్ ఒవైసి తరువాత అతని కుమారుడు సలాఉద్దిన్ ఒవైసి 1975లో పార్టి అద్యక్షుడైనాడు.
పాకిస్తాను కు వెళ్ళిన ఖాసిం రజ్వి కు అక్కడ గుర్తింపు కూడా లబించలేదు.ఖాసిం రజ్వి 68 యేళ్ళ వయసులో 15 జనవరి 1970 నాడు కరాచి లో మరణించాడు.
17 సెప్టెంబర్ విద్రోహమా? విలీనమా? విమోచనమా?
ఎంతో మంది నాయకులు వీరోచితంగా పోరాడినా నిజాం నియంత్రుత్వ పాలనను, రజాకార్ల అరాచకాలను అడ్డుకోడానికి శక్తి సరిపోలేదు.భారత ప్రభుత్వం జోక్యం చేసుకోకుంటె నిజాం రాచరిక వ్యవస్త ఇంకా నడిచేది, రజాకార్ల అరాచకాలు ఆగేవి కావు.ప్రపంచ పటంలో ఇప్పటికి రాచరిక వ్యవస్త ఉన్న దేశాల జాబిత పెద్దదిగానే ఉన్నది.ప్రజలను బానిస సంకెళ్ళనుంచి విడిపించి స్వేచ్చా వాయువులను ప్రసాదించిన భారత్ చర్యలను హైదరాబాద్ సంస్తాన్ ప్రజలు హర్షించారు.స్త్రీలను నగ్నంగా బతుకమ్మ ఆడించిన సంఘటనలను ఊహించుకుంటే విద్రోహ దినం, విలీన దినం అనేవాటిలో రాజకీయకోణం తప్ప ఎలాంటి న్యాయం కనబడట్లేదు.నిజాం, ఖాసిం రజ్వి ల పీడ విరుగడై దాదాపు 75 సంవత్సరాలైనా ఇంకా మనము ఆ రొజును ఏమని పిలువాలి అనే దగ్గరే ఉండడం విచారకరం.రజాకార్ల అరాచకాలు ప్రత్యక్షంగా చూసిన వాళ్ళు కొందరు ఇంకా జీవించి ఉన్నారు.

---- పోచంపల్లి తిరుపతిరెడ్డి 

Comments